Sunday, July 31, 2011

షాపింగ్ వేదాంతం

 షాపింగ్ అనగానే మనకి ముఖ్యంగా గుర్తుకువచ్చేది ఆడవాళ్ళు. నాకు ఇద్దరు స్నేహితురాళ్ళు వున్నారు. వారిద్దరూ షాపింగ్ కి వెళ్ళారంటే ఒక పట్టాన రారు. ఒకసారి వాళ్ళతో షాపింగ్ కి వెళ్లాను. మాతో ఇంకా కొందరు స్నేహితులు కూడా వచ్చారు. వీరిద్దరూ ట్రయల్ రూం లోకి వెళ్లి ఎంతకిరాలేదు. తీరా వచ్చాక మేము సరదాగా లెక్కపెట్టి చూద్దుము కదా ఇద్దరు కలిసి ఒక తొంభై రకాల బట్టలు ట్రయల్ వేసి చూసారు.  వీళ్ళ దుంప తెగ!! ఎంత ఓపిక అని ఆశ్చర్య పోడం మా వంతయింది. నాకు ఒక కజిన్ వుంది. తను అయితే అన్ని పెర్ఫెక్ట్ గా వుంటే తప్ప కొనదు. ఆమెతో షాపింగ్ కి వెళ్ళాలంటే బాగా తిరిగే ఓపిక వుండాలి. ఒకసారి చెప్పులు కొనడానికి వెళ్ళింది. రోజంతా చెప్పులరిగి పోయేలాగ తిరిగి తిరిగి ఆఖరికి ఓ చెప్పులజత కొంది.

అయితే ఈ షాపింగ్ పిచ్చికి ఆడ మగ అనే తేడా ఉండదని కొందరిని చూసాక అర్ధం అయ్యింది లెండి. కాక పోతే ఎంచేతో ఆడవారిని ఈ విషయంలో బాగా 'అన్ పాపులర్' చెయ్యడం జరిగిందని నా అభిప్రాయం. ఇక కొందరైతే ఇది అవసరమా కాదా అని కూడా ఆలోచించరు. నచ్చితే వెంటనే కోనేస్తూ వుంటారు.  అంతే కాక షాప్ లో వున్న సరుకంతా తిరగదోడి అన్ని చూస్తే తప్ప వాళ్ళకి మనశ్శాంతిగా అనిపించదు.మరి కొందరు వుంటారు. వాళ్ళు తమతో షాపింగ్ కి వచ్చిన వాళ్ళు కొంచం ప్రోత్సహిస్తే చాలు రెచ్చిపోయి కొనేస్తారు. అది వారి ఇష్టం అనుకోండి. 

నా విషయానికి వస్తే చిన్నప్పటి నుండి ఎందుకో షాపింగ్ ఆంటే అంతగా పడదు. 'షాపింగ్ అంటే ఇష్టం లేదు అనే దాన్ని నిన్నే చూసాం' అని నా స్నేహితురాళ్ళు అంటూ వుంటే నవ్వేసేదాన్ని. నేను కాలేజీ పూర్తి  చేసి ఆఫీసు లో జాయిన్ అయ్యేవరకు మా అమ్మ సెలెక్ట్ చేసిన బట్టలు వేసుకోనేదాన్ని. ఎందుకంటే మా అమ్మ అంత బాగా సెలెక్ట్ చేస్తుంది. అలా అని నేను అస్సలు షాపింగ్ చెయ్యను అని కాదు. ఇది కొనాలి అని అనుక్కుంటే అదే కొనేసి షాప్ నుండి బయటకి వచ్చేస్తానన్న మాట. నచ్చక పోతే మాత్రం అక్కడ ఎక్కువసేపు ఉండను. 

 నేను ఏడాది క్రితం ఒకసారి టీవీ లో 'ఒఫ్రా వినఫ్రెయ్ షో' చూడడం జరిగింది. ఆ షో టాపిక్ ఏంటంటే 'కొందరు జనాలు అవసరం లేక పోయిన ఎందుకు వస్తువులు కొంటారు' అని. ఆఖరికి తేలింది ఏంటంటే వారి జీవితాలలో ఏదో లోటు భర్తీ చెయ్యడం కోసం వస్తువులతో ఇంటిని నింపేస్తూ వుంటారట. చాల మంది 'షోపహోలిక్స్' ని (షాపింగ్ వ్యసనం ఉన్నవారిని) ఇంటర్వ్యూ చేసి ఈ విషయం తేల్చారు. ఆ తరవాత మరి కొన్ని రకాల షోలు చూడడం జరిగింది. కొందరు అవసరం లేని వస్తువులని పారేయకుండా ఇంటిని నింపేసి చెత్త గా ఉంచుతారు. దానిని 'హోర్డింగ్' అని పిలుస్తారు. ఇది ఒక మానసిక సమస్య. ఏదో తీరని మానసిక వ్యధలే కారణం.

మనిషి జీవితం చాల చిన్నది. కాని మనిషికి తాపత్రయం ఎక్కువ. ఎన్నో కోనేసుకోవాలని ఆశ. నిజంగా ఒక మనిషికి ఇంత సామాను అవసరమా? ఆ షో చూసాక కొద్ది రోజులు ఇలా వేదాంతంలోకి వెళ్ళిపోయా. అది నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే అనవసరంగా ఏది కొనకూడదు అని గట్టి నిర్ణయం తీసేసుకున్నా.  కొద్ది రోజులు చాల స్ట్రిక్ట్ గ పాటించా కుడా. కాని కుక్క తోక వంకర. ఏదో సేల్ పెట్టాడని ఆ మరుసటి వారమే బట్టలు కొన్నాను.



2 comments:

  1. బాగుందండి మీ షాపింగ్ వేదాంతం. మీరు ఇంకో రకం జనాలని మరిచారు ఆ రకమే నేను. విండో షాపింగ్ అనమాట! అన్నీచూస్తాం కొత్త రకాలేమిటి, ఎంత ఖరీదులో ఉన్నాయి అని. అంత చూసి నచ్చిన ఖరీదుకి దొరికినా కూడా అవసరమేమున్దిలే అని వదిలేసి వచ్చేసే రకం అనమాట!!!!

    ReplyDelete
  2. రసజ్ఞగారు, అవునండోయ్ విండో షాపింగ్ చెసే వాళ్ళని మర్చిపొయాను. గుర్తు చెసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete