Friday, March 23, 2012

అనగా అనగా ఓ ఫేస్ బుక్ కథ

చాలా రోజుల క్రితం మాట ఇది. పక్క రూం లో వున్న వ్యక్తి కి  కూడా ఎస్. ఎం. ఎస్ లు యిచ్చుకునే ఈ కాలం జనాన్ని చుస్తే నాకు జాలి.  ఓ ఇన్లాండ్ కవర్ మీదో, కార్డు మీదో చక్కగా వుత్తరం చూసి ఎన్ని రోజులైందో. కనీసం మెయిల్ కూడా చెక్ చెయ్యడానికి చిరాకు పడే నేను, నా స్నేహితుల పోరు పడలేక ఫేస్ బుక్ ఎకౌంటు తెరిచా. ఎకౌంటు అయితే తెరిచాను కాని ఎన్నడూ వాడిన పాపాన పోలేదనుకోండి. "ఒరేయ్  శీను ఏంట్రా నువ్వు ఇంకా పాతకాలం మనిషిలా ఉత్తరాలు పత్తరాలు అని వేలాడతావ్!" అని  నా బంధువులు, స్నేహితులు ఒక్కటే  ఏడిపించడం. మా ఆవిడ కూడా "ఏమండి నేను, నా ఫ్రెండ్స్ అందరమూ ఇందులో వున్నాం. మీ వారు ఫేస్ బుక్ వాడరా అని అందరు ఎగతాళి చేస్తున్నారు. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ" అని మా ఆవిడ  కూడా అనేసరికి ఇక నాకు తప్పలేదు. సరే ఈ ఫేస్ బుక్ సంగతేదో చూద్దామని నిశ్చయించుకున్నా.

ఆ రోజు శనివారం కావడంతో ప్రొద్దుటనుండి కూరలు తేవడం, బిల్లులు కట్టడం వగైరా పనులన్నీ అయ్యాక భోజనం చేసి కూర్చున్నాక, మా ఆవిడతో "ఏమోయ్ ఓసారి  ఫేస్ బుక్ లో లాగిన్ అవుతా. ఏది ఆ లాప్ టాప్ ఇలా అందుకో" అని అనగానే మా ఆవిడ మొహం ఆనందం తో వెలిగిపోయింది. "హమ్మయ్య ఇన్నాళ్టకి మీకు తీరిక దొరికింది. ఇదిగోండి. ఊరందరిది ఓ దారైతే ఉలిపికట్టెది ఓ దారి అన్నట్టు కాకుండా నలుగురిలాగే ఫేస్ బుక్ వాడితే బాగుంటుంది. ఎకౌంటు తెరిచి వదిలెయ్యడం కాదు" అని ఓ సలహా పారేసి ఎంచెక్క ముసుగు తన్ని పడుకుంది మా ఆవిడ.

నా ప్రొఫైల్ లో కి వెళ్లి చూడగానే చాల ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెండింగ్ లో వున్నాయి. నా చిన్ననాటి స్నేహితుల దగ్గరనుండి, నా క్లాస్మేట్లు,  ఎదురింటి సుబ్బారావుగారు, పక్కింటి రాజారామ్, ఆఫీసులో పనిచేసే నా సహచరులు నుండి, నా సహధర్మచారిణి వరకు. అవన్నీ టకటకా కన్ఫర్మ్ చేసేసా. హమ్మయ్య ఒక పనైపోయింది. జన జీవన స్రవంతి లోకి వచ్చి పడ్డా. ఎటొచ్చి చిక్కల్లా ఈ పోస్ట్ల తోనే. "ఏమి రాయాలబ్బా" అని చాలా సేపు ఆలోచించా. ఎంత ఆలోచించిన ఒక పట్టాన అర్ధం కాలేదు. బుర్ర వేడెక్కి పోయింది. వెళ్లి ఒక కప్పు కాఫీ కలుపుకొస్తే గాని ఐడియా తట్టదేమో. కాఫీ పూర్తి చేసాక ఒక ఆలోచన వచ్చింది. మిగత వారు ఏమి రాసారో చుస్తేనో. "అద్భుతం!! మంచి ఆలోచన" అంది నా మనస్సు. అందరి పోస్ట్లు చదవడం మొదలెట్టా.

"ఇవాళ మా కోడి పెట్టిన గుడ్డు తో ఆమ్లెట్ వేసా. వావ్ రియల్లీ గుడ్" అని నా ఆఫీసు లో సత్తి గాడి కామెంట్. కింద ఐఫోన్ తో తీసిన కోడి ఫోటో, దాని పక్కనే ప్లేట్ లో ఆమ్లెట్ ఫోటో. అందరు తమ సాయశక్తుల లైక్ లు, కామెంట్స్ ఇచ్చేసారు. "మాకు ఎప్పుడు తినిపిస్తావ్" అని ఒకరు. "నువ్వే చేశావా లేక హోటల్ నుండి ఆర్డర్ చేసి ఫోటో పెట్టావా" అని ఇంకొందరు.

ఇంకో పోస్ట్లో  మా ఫ్రెండ్ ఒకడు జలుబు చేసిందని రాస్తే, ఇంకోడు కాలు బెణికిందని రాసాడు. మా ఆవిడ చెల్లెలి కూతురు ఉదయం లేచిన దగ్గరనుండి పడుక్కునే వరుకు దినచర్య మొత్తం రాసి పడేసింది. సరే ఇదేదో బాగానే వుంది. నేను ఈ మాత్రం రాయలేనా అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నా.

సరే ఇంకో పోస్ట్ చూస్తే అది మా ఆవిడ రాసినది. "ఈ కుక్కపిల్ల తప్పిపోయి నా పొలంలోకి వచ్చింది. ఎవరైనా దత్తతు తీసుకోండి" అని రాసింది. "సుజాత ఫలానా పంట పెంచి ఇన్ని పాయింట్లు గెల్చుకుంది" అని ఇలా రకరకాలు ఒక పది పోస్ట్లు అవే వున్నాయి."సుజీ, ఏంటి నువ్వు జీవ కారుణ్య సంఘం లో, రైతు సంఘం లో ఎప్పుడు చేరావ్. చెప్పలేదు?" అన్నా.  దుప్పటి ముసుగు తీసి చూసి "ఏంటండి కలగాని కంటున్నారా. బంగారం లాంటి నిద్ర చెడగొట్టారు" అని లేచింది విసుగ్గా. "అది కాదోయ్ ఇలా చూడు. నువ్వే గా ఫేస్ బుక్ లో పెట్టావ్" అని పోస్ట్లు చూపిస్తే ఒక్కసారి ఉలిక్కిపడి "అయ్యో నా మతి మండ. మొక్కలకి నీళ్ళు పోయ్యలేదండి. ఈ పాటికి వాడిపోయి ఉంటాయి" అని ఒక్క ఉదుటన నా చేతిలోంచి లాప్ టాప్ లాగేసుకుని తన ఎకౌంటు లో లాగిన్ అయ్యి యేవో చూస్తోంది. తీరా తేలిందేమిటంటే అదేదో ఫారంవిల్ అని ఒక ఆట అని చెప్పింది. ఇదేమి విచిత్రం చెప్మా. నిజం మొక్కలు పెంచితే పువ్వులో పళ్ళో ఇస్తాయి గాని పనికిరాని ఈ ఆటలేంటి. ఇంతలో మా తమ్ముడి కొడుకు ఫోన్ చేసాడు ఏదో పని మీద. అదే విషయం వాడితో అంటే "నీకు తెలియదా పెదనాన్నా, ఈ ఆటకి క్రెడిట్ కార్డు తో పాయింట్స్ కొనుక్కోచ్చు. అమెరికా లాంటి దేశాల్లో అయితే ఇలాంటి ఆటలకి గిఫ్ట్ కార్డ్స్ కూడా అమ్ముతారు" అని చెప్తే దిమ్మతిరిగింది. "అమెరికా వాడిని చూసే నేర్చుకోవాలి వ్యాపారమంటే" అని మా చినన్నఅంటుండేవాడు. నిజమేనన మాట. సరే నాకెందుకు ఈ గోల. ఫోన్ పెట్టేసి వచ్చేసరికి మా ఆవిడ నా చేతిలో లాప్ టాప్ పెట్టి వెళ్లి పోయాక తిరిగి నా ఎకౌంటు చూడడంలో మునిగిపోయా.