Tuesday, August 16, 2011

విజేత

అలారం మోగడంతో మెలుకువ వచ్చింది పరిమళకి. ఇంకాసేపు ముసుగు తన్ని పడుకుందామని అనుకుంది. ఇంతలో ఆఫీసు గుర్తుకు వచ్చేసరికి నిద్ర కాస్త ఎగిరిపోయింది. "హు ఇవాళ ఇంకా గురువారం. మరో రెండ్రోజులు ఎలాగో ఆఫీసుకి వెళ్తే, ఆదివారం వచ్చేస్తుంది. హాయిగా గుర్రుపెట్టి పడుకోవచ్చు" అని మనసుకి సర్దిచెప్పుకుంది. చకచకా వంట, స్నానం, టిఫిన్ ముగించి పిల్లలికి, భర్తకి, తనకి డబ్బాలు సర్ది చెప్పులేసుకుంటూ "ఏవండి, ఆఫీసుకి వెళ్తున్నా. పిల్లల స్కూల్ ఆటో ఇంకో పది నిమిషాలలో వచ్చేస్తుంది. వాళ్ళని ఎక్కించి మీరు ఆఫీసుకి వెళ్ళండి" అని భర్త మధుకి చెప్పి బస్ స్టాప్ కి పరుగెత్తింది. అసలే ఎండాకాలం. ఉక్కపోతగా వుంది. దానికి సాయం బస్ జాడ ఇంకా లేకపోడంతో వుసూరుమనిపించింది పరిమళకి. ఇంతలో ఆఫీసులో స్వాతి గుర్తుకురాగానే చిరాకు పుట్టుకువచ్చింది.

 పరిమళ, స్వాతి ఇద్దరు ఒకే ఆఫీసులో గత పదేళ్ళగా పని చేస్తున్నారు. మొదట్లో స్వాతి బాగానే మాట్లాడేది. కాని రాను రాను ఆమెతో మాట్లాడగా పరిమళకి ఒక విషయం అర్ధమయింది. ఆమె ప్రతిదానికి ఇతరులతో పోల్చుకుని తను గొప్ప అని ఫీల్ అవుతూ వుంటుంది. తను చెప్పింది కరెక్ట్ అనే రకం. కాదని ఎవరైనా ఏదైనా చెప్పబోతే వాళ్ళని హేళన గా మాట్లాడుతూ వుంటుంది. పరిమళ స్వతహాగా నెమ్మదస్తురాలు కావడంతో స్వాతిని ఎదురుకోవడం ఆమెకి ఒక రకంగా కష్టమైన విషయం. అందుకనే స్వాతికి సాధ్యమైనంత దూరంగా మసలుతుంది. కాని పక్క సీట్ కావడంతో ఒక్కోసారి దొరికి పోతూ వుంటుంది. ఆలోచనల్లో ఉండగానే బస్ వచ్చేసింది. సీట్ దొరకడంతో పరిమళ అందులో కూలబడింది. కర్చీఫ్ తో మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ వుండగా పరిమళ కి మొన్న జరిగిన సంఘటన ఒకటి గుర్తుకు వచ్చింది.

ఆ రోజు తమ ఆఫీసులో క్లెర్క్ రాణి కొత్త నెక్లస్ పెట్టుకు వచ్చింది. లంచ్ అవర్లో మిగతా ఆడవాళ్ళందరూ చాలా బాగుంది అని మెచ్చుకున్నా, స్వాతి మాత్రం నెక్లస్ మా అమ్మమ్మ కాలం మోడల్లాగా వుంది అంటూ వెటకారం చేసింది. సాయంత్రం ఆఫీసు ముగిసేముందు మేనేజర్ వచ్చి "స్టార్ అఫ్ ది వీక్" అవార్డు ప్రకటించారు . స్టాఫ్ లో ఉత్సాహం నింపడానికి ఈ మధ్యే కొత్తగా ఈ అవార్డు మొదలుపెట్టారు. ఈ అవార్డు అందుకున్న వాళ్ళకి స్టార్ హోటల్లో ఒక జంటకి డిన్నర్ ఫ్రీ. ఆ వారం అవార్డు పరిమళకి వచ్చింది. మేనేజర్ పరిమళని విజేత గా అనౌన్స్ చెయ్యగానే అంతా కంగ్రాట్స్ చెబుతూ వుంటే స్వాతి మాత్రం దూరంగా ఏదో పని ఉన్నట్టు వేరే సెక్షన్లో గడిపింది. మరునాడు ఆఫీసు కి వచ్చాక కూడా ఏమి మాట్లాడలేదు.

అలాంటిది నిన్న సాయంత్రం ఆఫీసు నుండి బయలుదేరేటప్పటికి ఎందుకో స్వాతి చాలా ఉత్సాహంగా కనిపించింది. పని ముగించి బయలుదేరబోతున్న పరిమళని చూసి "ఏయ్ పరిమళ, నీకో విషయం చెప్దామంటే ఏంటి అప్పుడే వెళ్లి పోతున్నావ్. నిన్న అవార్డు వచ్చిన ఆనందంలో ఇవాళ పని డుమ్మా కొట్టావా" అని అడిగేసరికి పరిమళకి చిర్రెత్తుకొచ్చింది. అయినా తమాయించుకొని "లేదు అయిపోయింది. కొంచం తలనెప్పి గా వుందని" ఎలాగో తప్పించుకు వచ్చింది. "దేవుడా ఇవాళ దొరికి పోడం ఖాయం" అని అనుకుంటూ వుండగా తన దిగవలసిన స్టాప్ వచ్చేసింది. "ఆఫీసుకి వెళ్లి స్వాతి చూడకుండా నెమ్మదిగా తన సీట్లో కూర్చోవాలి. ఇంకో అరగంటలో ఎలాను మీటింగ్ వుంది కాబట్టి మధ్యాహ్నం దాక దీని సుత్తి తప్పించుకోవచ్చు" అనుకుంది. జాగ్రత్తగా బాగ్ సీట్ పక్కన పెట్టి ఊపిరి పీల్చుకుంది.  సీట్లో కుర్చోబోతుండగా "పరిమళా!!" అని స్వాతి గొంతు విని రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తూ ట్రాఫ్ఫిక్ పోలీసుకి  పట్టుబడ్డదానిలాగా ఉలిక్కిపడింది పరిమళ.

"ఏయ్ పరిమళా, నీకో విషయం చెప్పాలని నిన్నటి నుండి ప్రయత్నిస్తున్నా. నాకు మావారికి ఉత్తమ జంట అవార్డు వచ్చింది తెలుసా. మాకు డిన్నర్ ఏం ఖర్మ ఏకంగా ఐదు రోజులు ఊటీలో వసతి, భోజనం ఫ్రీ" అని ఊదరగొట్టేసింది. "అవునా!! ఇంతకి ఎప్పుడు పాల్గొన్నారు పోటి ఎక్కడ జరిగింది?" అని అడిగింది పరిమళ ఉండబట్టలేక. "పోటి గీటి జాంత నై. మావారికి నిన్న మధ్యాహ్నం ఆఫీసులో ఉండగా ఫోన్ వచ్చిందిట . ఇవాళ సాయంత్రం హోటల్ హాలిడే వ్యూలో అవార్డు ప్రదానం, డిన్నర్. వచ్చాక అన్ని వివరాలు చెప్తాన్లే" అని గర్వంగా చెప్పింది. "అదేంటి స్వాతి, ఏ పోటి లేకుండా ఉత్తినే అవార్డు ఎందుకిస్తారు?" అని అడిగిన పరిమళని పిచ్చిదాన్ని చూసినట్లు చూసింది. "లక్కీ డ్రా లో విజేతలుగా మమ్మల్ని ప్రకటించారు" అని ఇంకా ఏదో చెప్పబోయేంతలో మీటింగ్ టైం అవడంతో పరిమళ ఇంక ఆ విషయం అక్కడితో ముగించడం మంచిదని "అవునా!!కంగ్రాట్స్!!" అని చెప్పి మీటింగ్ రూం వైపు నడిచింది. పని ముగించుకుని వెళ్తున్న పరిమళకి సీట్లో స్వాతి కనిపించకపోవడంతో బహుశా హోటల్ కి  వెళ్ళడం కోసం ఇంటికి త్వరగా వెళ్ళిపోయివుంటుంది అని అనుకుంటూ బస్ స్టాప్ కి నడిచింది. 

స్వాతి మరునాడు ఆఫీసుకి వచ్చిందన్న మాటేగాని ఎంతకీ జాడలేదు. లంచ్ టైములో కూడా సీట్లోంచి కదలలేదు. స్వాతి తత్త్వం తెలిసిన పరిమళకి ఇది వింతగా అనిపించింది. "కొంచం అవకాశం వచ్చినా వదలని స్వాతి ఇవాళ ఉలుకు పలుకు లేదేంటబ్బా? ఒక వేళ వంట్లో బాగాలేదా?" అనుకుంది. "ఉహు, అలా కనిపించట్లేదు. మరి ఏమై ఉంటుంది?" అని ఆశ్చర్యపోయింది. "మెల్లగా కదిపి చూస్తే సరి. అమ్మో! ఒకవేళ తనని ఏమైనా అంటే? కాని ఎలాగైనా తెలుసుకోవాలి" అని నిశ్చయించుకొని స్వాతిని సమీపించింది.


"స్వాతి నిన్న ఫంక్షన్ బాగా జరిగిందా? ఏమిటి విశేషాలు?" అని అడగ్గానే అడిగిందే తడవుగా పెద్ద ఉపన్యాసం దంచే స్వాతి ముందు ఏమి మాట్లాడలేదు. కొంచం కదపగా తిట్లవర్షం మొదలుపెట్టింది. వివరంగా చెప్పమని పరిమళ అడగ్గా "అంతా వుట్టి నాటకం. ఉత్తమ జంటా నా ముఖమా. వెళ్ళగానే ఒక లేడి ఎదురొచ్చి మమ్మల్ని ఆహ్వనించగానే ఎంతో మురిసిపోయాం. చాల సేపు మమ్మల్నిఒక చోట వెయిట్ చేయించారు. ఏది వేదిక ఎక్కడ? అతిథులు ఏరి? అని నిలదీస్తే అవార్డు ప్రదానం ఏమి కాదు. మీరు ఊటీకి ట్రిప్ గెల్చుకున్నారు. అది మీకు డిన్నర్ తరవాత అందచేస్తాం. ముందు మీరు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యాలి అన్నారు. తీరా చూస్తే మీరు ఈ రిసార్ట్ కి మెంబెర్ షిప్ కి  ఇంత డబ్బుకట్టండి. అప్పుడు మీకు అందులో ఐదు రోజులు వసతి, భోజనం ఫ్రీ అన్నారు. కట్టమంటే కనీసం రిజిస్ట్రేషన్ కి డబ్బు కట్టమన్నారు. నేను మావారు గట్టిగా తగువు పడేసరికి భోజనం కూడా పెట్టకుండా పంపించేసారు. ఇంటికి వచ్చి వండే ఓపికలేక ఆ హోటల్లోనే బిల్ కట్టి తినేసి వచ్చాం" అని ముగించేసరికి పరిమళకి నవ్వాగలేదు. 

Sunday, July 31, 2011

షాపింగ్ వేదాంతం

 షాపింగ్ అనగానే మనకి ముఖ్యంగా గుర్తుకువచ్చేది ఆడవాళ్ళు. నాకు ఇద్దరు స్నేహితురాళ్ళు వున్నారు. వారిద్దరూ షాపింగ్ కి వెళ్ళారంటే ఒక పట్టాన రారు. ఒకసారి వాళ్ళతో షాపింగ్ కి వెళ్లాను. మాతో ఇంకా కొందరు స్నేహితులు కూడా వచ్చారు. వీరిద్దరూ ట్రయల్ రూం లోకి వెళ్లి ఎంతకిరాలేదు. తీరా వచ్చాక మేము సరదాగా లెక్కపెట్టి చూద్దుము కదా ఇద్దరు కలిసి ఒక తొంభై రకాల బట్టలు ట్రయల్ వేసి చూసారు.  వీళ్ళ దుంప తెగ!! ఎంత ఓపిక అని ఆశ్చర్య పోడం మా వంతయింది. నాకు ఒక కజిన్ వుంది. తను అయితే అన్ని పెర్ఫెక్ట్ గా వుంటే తప్ప కొనదు. ఆమెతో షాపింగ్ కి వెళ్ళాలంటే బాగా తిరిగే ఓపిక వుండాలి. ఒకసారి చెప్పులు కొనడానికి వెళ్ళింది. రోజంతా చెప్పులరిగి పోయేలాగ తిరిగి తిరిగి ఆఖరికి ఓ చెప్పులజత కొంది.

అయితే ఈ షాపింగ్ పిచ్చికి ఆడ మగ అనే తేడా ఉండదని కొందరిని చూసాక అర్ధం అయ్యింది లెండి. కాక పోతే ఎంచేతో ఆడవారిని ఈ విషయంలో బాగా 'అన్ పాపులర్' చెయ్యడం జరిగిందని నా అభిప్రాయం. ఇక కొందరైతే ఇది అవసరమా కాదా అని కూడా ఆలోచించరు. నచ్చితే వెంటనే కోనేస్తూ వుంటారు.  అంతే కాక షాప్ లో వున్న సరుకంతా తిరగదోడి అన్ని చూస్తే తప్ప వాళ్ళకి మనశ్శాంతిగా అనిపించదు.మరి కొందరు వుంటారు. వాళ్ళు తమతో షాపింగ్ కి వచ్చిన వాళ్ళు కొంచం ప్రోత్సహిస్తే చాలు రెచ్చిపోయి కొనేస్తారు. అది వారి ఇష్టం అనుకోండి. 

నా విషయానికి వస్తే చిన్నప్పటి నుండి ఎందుకో షాపింగ్ ఆంటే అంతగా పడదు. 'షాపింగ్ అంటే ఇష్టం లేదు అనే దాన్ని నిన్నే చూసాం' అని నా స్నేహితురాళ్ళు అంటూ వుంటే నవ్వేసేదాన్ని. నేను కాలేజీ పూర్తి  చేసి ఆఫీసు లో జాయిన్ అయ్యేవరకు మా అమ్మ సెలెక్ట్ చేసిన బట్టలు వేసుకోనేదాన్ని. ఎందుకంటే మా అమ్మ అంత బాగా సెలెక్ట్ చేస్తుంది. అలా అని నేను అస్సలు షాపింగ్ చెయ్యను అని కాదు. ఇది కొనాలి అని అనుక్కుంటే అదే కొనేసి షాప్ నుండి బయటకి వచ్చేస్తానన్న మాట. నచ్చక పోతే మాత్రం అక్కడ ఎక్కువసేపు ఉండను. 

 నేను ఏడాది క్రితం ఒకసారి టీవీ లో 'ఒఫ్రా వినఫ్రెయ్ షో' చూడడం జరిగింది. ఆ షో టాపిక్ ఏంటంటే 'కొందరు జనాలు అవసరం లేక పోయిన ఎందుకు వస్తువులు కొంటారు' అని. ఆఖరికి తేలింది ఏంటంటే వారి జీవితాలలో ఏదో లోటు భర్తీ చెయ్యడం కోసం వస్తువులతో ఇంటిని నింపేస్తూ వుంటారట. చాల మంది 'షోపహోలిక్స్' ని (షాపింగ్ వ్యసనం ఉన్నవారిని) ఇంటర్వ్యూ చేసి ఈ విషయం తేల్చారు. ఆ తరవాత మరి కొన్ని రకాల షోలు చూడడం జరిగింది. కొందరు అవసరం లేని వస్తువులని పారేయకుండా ఇంటిని నింపేసి చెత్త గా ఉంచుతారు. దానిని 'హోర్డింగ్' అని పిలుస్తారు. ఇది ఒక మానసిక సమస్య. ఏదో తీరని మానసిక వ్యధలే కారణం.

మనిషి జీవితం చాల చిన్నది. కాని మనిషికి తాపత్రయం ఎక్కువ. ఎన్నో కోనేసుకోవాలని ఆశ. నిజంగా ఒక మనిషికి ఇంత సామాను అవసరమా? ఆ షో చూసాక కొద్ది రోజులు ఇలా వేదాంతంలోకి వెళ్ళిపోయా. అది నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే అనవసరంగా ఏది కొనకూడదు అని గట్టి నిర్ణయం తీసేసుకున్నా.  కొద్ది రోజులు చాల స్ట్రిక్ట్ గ పాటించా కుడా. కాని కుక్క తోక వంకర. ఏదో సేల్ పెట్టాడని ఆ మరుసటి వారమే బట్టలు కొన్నాను.



Friday, July 22, 2011

అమ్మమ్మ కతలు: సరదాగా సినిమాకి

అసలే ఎండాకాలం. ఒంటి పూట బళ్ళు. ఎంత త్వరగా స్కూల్ అయిపోతుందా. అమ్మమ్మ ఇంటికి వెళదామా అని ఎదురుచూస్తూ ఉండగానే అమ్మమ్మ గొడుగు వేస్కొని వచ్చేసింది నా కోసం. స్కూల్ నుండి తీసుకు వచ్చి అన్నం తినిపించాగానే బాగా అలిసిపోయి నిద్ర ముంచుకు వచ్చేసింది నాకు. అమ్మమ్మ నా తల నిమురుతూ వుంటే ఎప్పుడు నిద్రలో జారుకున్ననో తెలియదు. నన్ను జాగ్రత్తగా  పడుక్కోబెట్టింది.

ఉదయం పదవ్వగానే ఆవిడ భోజనం అయిపోయేది. కిళ్ళీ  వేసుకొని పడుక్కునేది కాసేపు. అమ్మమ్మ ఏంటి? కిళ్ళీ  వేస్కోడం ఏంటి? అనుక్కునేరు. ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ వుంటుంది. అమ్మ తిడుతుందేమో అని భయం ఒక పక్క వున్నా మా అమ్మని ఇదే విషయం అడిగేసా ఒక రోజు. మా అమ్మమ్మకి పెళ్ళయ్యాక హఠాత్తుగా పంటినొప్పి రావడం, ఎన్ని మందులు వాడినా తగ్గక పోవడంతో ఎవరో చెక్క నవలమని చెప్పిన సలహా విని మా తాతగారు చెక్క తెప్పించి ఇచ్చేవారు. పంటినొప్పి తగ్గినా చెక్క అలవాటు అలాగే ఉండిపోయింది. తరవాత కిళ్ళీవేసుకోడం అలవాటయ్యింది అని అమ్మ చెప్పింది.

నేను నిద్రపోయానని అలా పక్కింటి మామ్మగారి ఇంటికి వెళ్లి లోకాభిరామాయణం మాట్లాడుతోంది అమ్మమ్మ.  "మన పక్క థియేటర్లో 'మల్లీశ్వరి' సినిమా ఆడుతోంది పిన్నిగారు. మధ్యాహ్నం వెళదామా?" అని మామ్మగారు మా అమ్మమ్మని   అడిగారు. ఆవిడ అడగడం ఇది మూడోసారి. నిజానికి ఆ సినిమా అంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టం. అందులో "మనసున మల్లెల మాలలూగెను..." అనే పాటంటే ఇంకా ప్రాణం. కాని వేసవి ఎండలు కొంచం తగ్గాక వెళ్ళచ్చు అని వాయిదా వేస్తూ వచ్చారు కమలమ్మగారు. ఇంకా ఆలస్యం చేస్తే సినిమా వెళ్లిపోతుంది అని ఆవిడ అనడంతో మరునాడు వెళ్ళాలని ఇద్దరు అనుకున్నారు. 

ఈ లోపు నేను నిద్ర లేవడం, అమ్మమ్మ కనిపించక "అమ్మమ్మ !!అమ్మమ్మా!!" అంటూ ఏడుస్తూ తలుపు తెరవబోయాను. కాని అది రాలేదు. బహుశా అమ్మమ్మ బయటనుండి గడియపెట్టి వుంటుంది. దానితో మరింత ఏడుపు వచ్చింది. ఈ లోగా ఎవరో చూసి అమ్మమ్మకి చెప్పడంతో పరుగెత్తి వచ్చి తలుపు తెరిచి నన్ను ఎత్తుకుంది. "పండు, నిద్ర లేచావా. నువ్వు పడుకున్నావు కదా అని పక్కింటి బామ్మగారితో మాట్లాడుతున్న కన్నా" అని ఊరుకో బెట్టింది. ఏడుపు ఆపక పోవడంతో "ఏడవకు రా కన్నా. రేపు మనం సరదాగా సినిమాకి వెళదాం. సరేనా" అని అనడంతో నేను చాలా సంతోషించా. 

మరునాడు రానే వచ్చింది. స్కూల్ నుండి రాగానే అన్నం తిని మాట్నీకి బయలుదేరాం ముగ్గురం. మాములుగా అయితే నడిచిపోయే దూరమేగాని మండుటెండ పైగా చిన్నపిల్లని నేనున్నాను అని  రిక్షా బేరమాడుకుని వెళ్లాం. తీరా చుస్తే థియేటర్లో 'వందేమాతరం' అనే కొత్త సినిమా ఆడుతోంది.  'మల్లీశ్వరి' సినిమా ముందురోజు వెళ్లిపోయిందిట.   ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళు అనుకునేంతలో నేను ఆరున్నొక్క రాగం పెట్టడంతో ఇక తప్పక ఆ సినిమా టికెట్స్ తీసుకున్నారు. ధియేటర్లో జనం పల్చగావున్నారు. సినిమా మొదలవ్వడంతో అంతా కూర్చున్నారు. మా ముందువరుసలో ఓ తల్లితండ్రి పిల్లజెల్ల కుర్చుని వున్నారు. వారి ముందు సీట్లు అన్ని ఖాళీ. సినిమా మొదలైన పావుగంట తరవాత "అమ్మమ్మా నేను ఆ ఖాళీ సీట్లలో కుర్చుంటా ప్లీజ్" అని అడిగా. సరే అంది అమ్మమ్మ. ఇంటర్వల్ రాగానే పెద్దగా ఓ ఆడ గొంతు, మా అమ్మమ్మ గొంతు పొట్టాడుకుంటూ వినిపించాయి. "ఎహ్ హమారీ బచ్చి హై" అంటే "కాదు ఇది నా పిల్ల" అని పెద్ద గొడవ. అక్కడ ఓ మినీ యుద్ధవాతావరణం నెలకొంది.  నేను ఓ ఐదునిమిషాల తరవాత మెల్లగా గొంతుపెగుల్చుకుని "అమ్మమ్మ నేను ఇక్కడే వున్నా" అని అనడంతో మా అమ్మమ్మ వాళ్ళతో సిగ్గుపడి "క్షమించండి అచ్చు మా మనవరాలి లాగ కనపడితేను..." అని మాత్రం అనగలిగింది. "ఇంటికి వెళ్ళాక నీ పని అయిపోయింది" అంది నా మనసు . అమ్మమ్మ మాత్రం "నువ్వు ఎప్పుడు అక్కడ కుర్చున్నావో మర్చిపోయానే" అని నవ్వేసింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా.

Wednesday, July 20, 2011

అమ్మమ్మ కతలు: స్కూలు గోల

"ప్రొద్దుననగా వెళ్ళింది స్కూలుకి. ఏం చదువులో ఏంటో ఈ కాలం పిల్లలకి" అని తిట్టుకున్నారు కమలమ్మ గారు ఎల్.కె.జి చదువుతున్న నన్నుతల్చుకుంటు. అలా అని ఆవిడకి చదువంటే ఇష్టం లేదని అనుకునేరు. చదువంటే ఆవిడకి ప్రాణం. చిన్నవయస్సులో భర్త పొతే బండెడు సంసారన్ని ఒంటరిగా ఎలా ఈదుకొచ్చిందో ఆవిడకే తెలుసు. అందుకే చదువు ఆడపిల్లలకి ఎంతో ముఖ్యం అని ఆవిడ తన కూతుర్లు అందరిని కొడుకులతో సమానంగా చదివించింది. నా మీద ప్రేమతో అలా అనిపించింది ఆమెకి. అంతే!!

నాన్న ఉద్యోగరీత్యా మేము ఆ ఊర్లోనే వుండేవాళ్ళం.అమ్మమ్మ ఇంటికి దగ్గర వున్న స్కూల్లో చదివేదాన్ని.  తన ఇంటికి  స్కూల్ దగ్గరే కావడంతో మధ్యాహ్నం లంచ్ అవర్లో నన్ను తీసుకొచ్చి అన్నం తినిపించి మరల స్కూలుకి దిగబెట్టేవారు కమలమ్మగారు. ఎప్పుడైనా ఒంటిపూట బళ్ళు ఐతే, అమ్మ సాయంకాలం వచ్చి తీసుకువెళ్ళే వరకు తన దగ్గర అట్టే పెట్టుకుని వీధిలో బంధువులు, స్నేహితుల ఇళ్ళకి 'మా మనుమరాలు ' అని మురిపెంగా తీసుకువెళ్ళేవారు ఆవిడ.

"అమ్మమ్మా అమ్మమ్మా!" అంటూ అల్లుకుపొయేదాన్ని.అందుకే ఆవిడకు నేనంటే వల్లమాలిన ప్రేమ.స్కూల్లో రోజు పన్నెండు గంటలకి లంచ్ బెల్ కొట్టినా, అమ్మమ్మ మాత్రం "పిల్ల ఎండ పడిపోతుంది" అని ఓ గొడుగు పుచ్చుకుని అరగంట ముందే చేరుకుని "మీ చదువులు మీరు, మీ మొహాలు మండా. చంటి వెధవలకి ఇంతింతసేపు చదువులు ఏవిటి?" అని అక్కడ అటెండర్ ని తెగ కంగారు పెట్టేసేవారు. అటెండర్ అప్పారావు కి ఇది మాములే. "బామ్మగారు, ప్లీజ్!! నా వుద్యోగం వూడి పోతుందండీ . అలా మీ మనుమరాలు ఒక్కర్తి కోసం బెల్లు కొట్టకూడదండి" అనేవాడు.

ఎప్పుడైనా భోజనం తరువాత "అమ్మమ్మా! ఇవాళ స్కూల్ కి వెళ్ళను" అని గోల పెడితే క్లాస్స్ రూం లోపలవరకు తీసుకువెళ్లి దిగబెట్టి కాసేపు కూర్చుని వచ్చేది ఆవిడ. పెద్దయ్యాక ఒక్కోసారి కాలేజ్, లేదా ఆఫీసు కి వెళ్ళాలని అని అనిపించక పోతే, అదే గుర్తుకు వచ్చేది నాకు. ఇంకా మారం చేస్తే 'తాయిలం' ఇస్తానని ఆశ పెట్టి స్కూల్ కి పంపేది.

ఇలా రోజులు గడిచిపోతుండగా, ఒక రోజు కూడా ప్రతిరోజులాగానే ఆవిడ గొడుగుతో బయలుదేరారు. కాకపొతే ఆవేళ కొద్దిగా ఆలస్యం అయ్యింది. ఆయాసపడుతూ రొప్పుతూ కమలమ్మగారు వెళ్ళేసరికి అటెండర్ అప్పారావు అక్కడ స్టూల్ మీద కనపడలేదు. "వీడు రోజు ఇక్కడే వుంటాడు. అలాంటిది ఇవాళ కనపడట్లేదేవిటో" అని కంగారుపడుతూ ఆఫీస్ రూం వైపు దారితీసారు కమలమ్మగారు. "ఏమ్మా లంచ్ బెల్ కొట్టేసారా?" అని అక్కడ కనిపించిన ఆయాని అడిగారావిడ."కొట్టేసారండి" అని చెప్పేసరికి "ఎల్.కె.జి క్లాస్ రూం ఎక్కడుంది. నా మనుమరాలు నాకోసం చూస్తూవుంటుంది. కొంచెం పిల్చుకురామ్మ" అని అర్ధింపుగా అడిగారావిడ. "ఎవరూ లేనట్లున్నారమ్మా. ఐనా ఓ మారు సూసొత్తాను వుండండి" అని ఆయా క్లాస్ రూం వైపు వెళ్ళింది. "ఈ ఆయా పొరపడివుంటుంది. తను వచ్చేదాకా బుద్ధిగా కూర్చుంటుందిలే. ఎక్కడికి కదలదు" అని ధీమాగా ఎదురుచూడసాగారు ఆవిడ.దూరం నుండి ఆయా ఒక్కర్తే రావడం చూసి కమలమ్మగారి ఆదుర్దా ఎక్కువవ్వసాగింది. "ఎవలూ లేరమ్మా. కలాసురూం ఖాలీ" అని ఆయా చెప్పడంతో ఆవిడకి ముచ్చెమటలు పోసాయి. "సరిగ్గా చూసావా. ఇంకెక్కడైన వుందేమో" అని టెన్షన్ పడసాగారు. ఇంతలో అప్పారావు వచ్చి "పిల్లలంతా ఎల్లిపోనారు బామ్మగారు" అని చెప్పడంతో ఆవిడకి ఒక్కసారి గుండె గుభేలుమంది. "అయ్యొ పిల్ల ఎమైందో. ఎవరైన ఎత్తుకుపొయారేమో. అసలే రొజులు బాగాలేవు. ఇప్పుడు కూతురికి అల్లుడుకి ఎలా మొహం చూపించాలి" అని తల్చుకుంటే ఏడుపు వచ్చింది ఆవిడకి.

కమలమ్మగారికి ఏమిచెయ్యలో పాలుపోవడం లేదు. "కూతురికి చెప్తే? అమ్మో!! ఇది విని తట్టుకోగలదా. పోనీ అల్లుడికి చెప్తే? ఆయన అసలు తట్టుకొలేడు. ఇప్పుడు ఏమి చెయ్యడం?" అని అలోచించసాగారు. చివరికి తన వీధిలోనె అద్దెకి వుండె మనుమరాలి వాళ్ళ క్లాస్ మేట్ జ్యోతి గుర్తుకి వచ్చింది కమలమ్మగారికి. పరుగు పరుగున వాళ్ళ ఇంటి తలుపు తట్టారు. "ఏమ్మా మా మనుమరాలు మీ ఇంటికి ఏమైన వచ్చిందా?" అని అడిగారావిడ."లేదు అమ్మమ్మగారు రాలేదు. స్కూల్ అయ్యాక నేను ఒక్కదాన్నే మా ఇంటికి వచ్చేసా" అని చెప్పింది జ్యొతి.అది విని ఆవిడ ఆందోళన ఇంకా అధికమైంది. ఇంక లాభం లేదని కూతురి ఆఫీసుకి రిక్షా చేయించుకుని వెళ్ళారు.  "అమ్మా ఈ టైములో ఇలా వచ్చావేమిటి? ఒక్కర్తివీ వచ్చావేంటి? పండు ఏది?" అని ప్రశ్నించే సరికి ఆవిడకి దుఖం ఆగలేదు. "పండు కనిపించటం లెదు" అని బావురుమన్నారు. "అమ్మా, ఏమిటి నువ్వు చెప్పేది. ఎక్కడకి వెళ్ళి వుంటుంది. స్కూల్లో సరిగ్గా వెతికావా?" అని పూడుకుపోయిన గొంతుకతో వస్తున్న ఏడుపు ఆపుకుంటూ అడిగింది అమ్మ. "అంతా వెతికే వస్తున్నానమ్మా. ఎక్కడాలేదు" అని బదులిచ్చారు ఆవిడ తన ఏడుపు దిగమింగి. "మళ్ళీ ఇంకోసారి చూసి వద్దాం పదమ్మా" అని రిక్షాలో స్కూల్ కి బయలుదేరారు ఇద్దరూ.

అక్కడ అటెండరు అప్పారావు కనపడ్డాడు మళ్ళీ. "బామ్మగారు ఇలగ వొచ్చారేటండి మళ్ళీ? మీ మనవరాలు కనపడనేదా?" అని అడిగాడు. వెంటనే అమ్మ "లేదయ్యా. ఎల్.కె.జి క్లాస్ టీచర్ వున్నారా? వెళ్ళిపొయారా?" అని అడిగారు. "స్టాఫ్ మీటింగ్ వుందని ఇయ్యాల ఇక్కడె వున్నారమ్మ అందరూ. మీటింగ్ గంట క్రితమే ఐపోనాదమ్మ. కొందరు టీచర్లు ఇంకా పని వుండి స్కూల్ లోనే వున్నారు. ఇక్కడే కూకోండి. పిల్సుకు వొత్తాను." అని లోపలికి వెళ్ళాడు. ఇద్దరికీ కూర్చో బుద్ధి కాలేదు. "ఒకవేళ టీచర్ కి తెలియదంటే ఏమిచెయ్యడం? ఈయనకి చెప్పి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యడమే. ఎక్కడికి వెళ్ళుంటుంది నా చిట్టితల్లి?" అని అలోచనలో పడింది అమ్మ.  ఒకపక్క కమలమ్మగారు తనకి తెలిసిన దేవుళ్ళందరికి మొక్కెస్తున్నారు.  ఇంతలో ఎల్.కె.జి క్లాస్ టీచర్ లక్ష్మి వచ్చారు అక్కడికి. "పిల్లలందరు క్లాస్ వదలగానే వెళ్ళి పోయారు మేడం" అన్న ఆవిడ మాటవిని కుప్పకూలిపొయారు ఆవిడ.

"భగవంతుడా!! అనుక్కున్నంతా అయ్యింది. ఇప్పుడు ఏది దారి?" అని స్కూల్ ఆవరణ దాటి రిక్షా లో కుర్చోబొయేంతలో "మేడం. ఒక్క నిమిషం!!" అనే పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చుసే సరికి లెక్కల టీచర్ నీరజ కనిపించారు. "స్కూల్ లో కొత్తగా జాయినైన దీప్తి టీచర్ ఇందాకల పిల్లలు కొందరిని రిక్షాలో ఎక్కించుకుని ఎటో వెళ్ళడం చూసాను" అని చెప్పడంతో ఒక్కసారిగా టెన్షన్ తగ్గి దాని స్థానంలో కోపం చోటుచేసుకుంది అమ్మలో.

దీప్తి టీచర్ ఇల్లు ఎక్కడో కనుక్కుని అమ్మ, అమ్మమ్మ బయలుదేరబోతుండగ ఎదురుగ మిగతా పిల్లలతో గెంతుకుంటూ ఆడుకుంటూ రిక్షాలో  వస్తున్న నన్ను చూడగానే వాళ్ళిద్దరికి ప్రాణం లేచివచ్చింది. ఏడుస్తున్న అమ్మని అమ్మమ్మని చుస్తూనే నేను ఒక్క వుదుటన "అమ్మా! అమ్మమ్మా!!" అని అల్లుకుపోడం, ఇక ఆతరవాత దీప్తి టీచర్ కి అందరూ క్లాస్ తీసుకోడం, ఆవిడ "సారీ అండీ,  మా ఇల్లు స్కూల్ దగ్గరలోనే కదా. పిల్లల్ని సరదాగ ఇంటికి తీసుకు వెళ్ళి కొంచెం స్నాక్స్ పెట్టి ఆడించి తీసుకు వద్దామని అనుకున్నాగాని, మీరంతా ఇలా కంగారు పడతారని అనుకొలేదు" అని సంజాయిషీ ఇవ్వడం జరిగిపొయాయి."పండు... మా బంగారం!!! ఎంత హడలుకొట్టేసావే మా అందరిని??!!!" అని అమ్మమ్మ నన్ను హత్తుకుంది.

Friday, July 8, 2011

అమ్మమ్మ కతలు: మా అమ్మమ్మ ఇంజినీరు!!

సుబ్బమ్మగారి అల్లుడికి విశాఖపట్నం నుండి పాడేరు ట్రాన్స్ఫెర్ అయ్యింది. ప్రభుత్వ క్వార్టర్స్ లో ఖాళీ లేకపొవడంతో ఇంటి వేటలో పడ్డారు. చివరికి ఒక రొజు మొక్కల అప్పారావు వొచ్చి "మీరు ఇల్లు వెతుకుతున్నారటగా చెల్లెమ్మా. మీకు అభ్యంతరం లేక పొతే నా ఇల్లు ఖాళీగా వుంది. సున్నాలు వేయించి ఇస్తాను." అని చెప్పాడు. అది రెండుగదుల పెంకుటిల్లు. ఒక బెడ్రూం, ఇంకొటి వంట గది. ఆ రొజుల్లొ అద్దె ఐదు రూపాయలు వుండేది. ఒక మంచిరోజు చూసుకొని సుబ్బమ్మగారు, అల్లుడు, కూతురు, మనుమలు రాముడు, చంటి ఆ ఇంటిలో అడుగు పెట్టారు.

అవడానికి సుబ్బమ్మగారు ఐదోతరగతి చదివినా చాలామంది కన్నా 'కామన్ సెన్స్ ' ఎక్కువేనని చెప్పొచ్చు. అసలు ఆ కాలం అమ్మమ్మలు అందరూ అంతేనని అనిపిస్తూ వుంటుంది. జరిగిన విషయం చెబితే అవునని ఒప్పుకుంటారు మరి. ఇంట్లోదిగిన తరువాత రెండు రోజులు ఇల్లు సర్దుకోడంతో హడావిడిగా గడిచింది. ఇల్లు విశాలంగా వుండాలా ఏంటి? మనసు విశాలమైతే చాలదూ? అదే ఓ ఇంద్రభవనంలా అనిపించేది. "పెరడు మాత్రం చక్కగా వుందనుకో. ఎంచక్కా ఇక్కడ బీరపాదు, కాకరపాదు వేసుకొచ్చు" అనుకున్నారు సుబ్బమ్మగారు. కాకపొతే చిన్న చిక్కొచ్చింది. అంత వరకు సిమెంటు గచ్చులే అలవాటు పట్నంలో. పెరట్లో బాత్రూం మట్టిగోడతో కింద గచ్చు లేకుండా ఇబ్బందిగా వుండేది.

ఇంతలొ ఎదురింటి పాత్రుడన్న ఇల్లు మరమ్మత్తు చేయిస్తుంటే సుబ్బమ్మగారికి ఓ అలొచన వచ్చింది. "పిల్లలు బాత్రూంలో జారిపడుతున్నారు . కొంచెం సిమెంటు వుంటే ఇద్దు" అని పాత్రుడన్నని అడిగారు. అక్కడి పనులు చేస్తున్న మేస్త్రిని సిమెంటు ఇసుక పాళ్ళు కనుక్కుని పాంగి గాడిని కేకేసి బుంగెడ్డ నుండి ఇసుక తెప్పించారు. "బుడ్డి, ఇప్పుడు తాపి ఎలగి సెస్తావ్" అని పాంగి గాడి ప్రశ్న. మేస్త్రి చెప్పిన విధంగా సిమెంటు ఇసుక కలిపి, ఇత్తడి చెంబు ఒకటి తీసుకుని తాపి చెయ్యడం మొదలు పెట్టారు సుబ్బమ్మగారు. చూస్తుండగనే బాత్రూంలో సిమెంటు నేల తయ్యారవసాగింది. "మొన్న గాలివానకి ఇంటి పైన ఈకులుసాయి (eucalyptus oil ని సుబ్బమ్మగారు అలా పిలుస్తారన్నమాట ) చెట్లు పడి పెంకులు పగిలి కింద పడ్డాయిరా. అవి ఇలా పట్రా" అని పాంగి గాడికి ఆర్డర్ జారిచేసారు సుబ్బమ్మగారు.వాటిని తిరగేసి పెట్టి సిమెంటుతో తాపి చేసి తూము కట్టారు.

ఇదిలా వుండగా ఊర్లో ఎలెక్షన్లు జరిగితే ఎలెక్షన్ డ్యుటీకి వచ్చే జనానికి, లేదా పరిక్ష పేపర్లు దిద్దడానికి వచ్చే టీచర్లకి అక్కడి ఇళ్ళ నుండి భోజనం, స్కూల్ లో వసతి ఇవ్వడం సాధరణం.  విశాఖపట్నంలో వున్నప్పుడు కిరసనాయిలు పొయ్య మీద వంట అలవాటు. పాడేరు వచ్చాక వచ్చెపొయ్యె జనంతో  వంటకి ఇబ్బంది పడసాగారు. దానితో మరో మారు సుబ్బమ్మగారు తన బుర్రకి పదును పెట్టారు.  "ఒరేయ్ పాంగి, పెయ్యల్ గెడ్డనుండి కొంచెం బంకమన్ను తెచ్చుకురా" అని చెప్పి మన్ను కుమ్మి దానితో ఓ రెండు వంటపొయ్యలు కట్టారు.

ఆ తరువాత ఇంక సుబ్బమ్మగారు వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో కట్టి పడేసారు. వంటింట్లో దేవుడు పెట్టుకోడానికి  ఓ గట్టు,  సామాను పెట్టుకోడానికి ఒక గూడు, బాత్రూంలో వెణ్ణీళ్ళూ కాచుకోడానికి కర్రల పొయ్య ఇత్యాది అన్నమాట.

Thursday, June 30, 2011

అమ్మమ్మ కతలు: డొక్కు లారీ

వేసవి సెలవలు ఇవ్వడంతో సుబ్బమ్మగారి మనవలు రాముడు, చంటి ఇద్దరు ఇంట్లోనే వున్నారు. వంటపొయ్య దగ్గర వున్న సుబ్బమ్మగారు, ఇద్దరినీ కేకేసి "అమ్మకి తలనొప్పిగా వుంది. పడుకుంది. ఇద్దరు చెంబుడేసి నీళ్ళు పోసుకుని, పిడికిడేసి అన్నంతినేసి ఆడుకోండి. గొడవ చెయ్యద్దు" అని చెప్పి పంపించేసారు.

వాళ్ళిద్దరూ బుద్ధిగా స్నానంచేసి ఇంత అన్నం తిని, క్యారం బోర్డు ఆడుకోడం మొదలు పెట్టారు. కొంతసేపు ఆట బాగానే సాగింది. ఇంతలో రాముడు రెడ్ కాయిన్ వెయ్యడం తో చంటికి కోపం వచ్చి మీదపడి కొట్టడం మొదలు పెట్టాడు. రాముడు ఊరుకోలేదు. తను ఒక దెబ్బవేసాడు. అది చిలికిచిలికి గాలివాన అయ్యింది. ఇంతలో సుబ్బమ్మగారు చూసి ఇద్దరినీ కోప్పడి, చంటిగాడిని చిన్నదెబ్బ వేసారు. అంతే... వాడు ఏడుస్తూ ఇంట్లోంచి పారిపోయాడు.  గంట, రెండు గంటలు, మూడు గంటలు గడిచాయి కాని చంటిగాడి జాడ లేదు. సుబ్బమ్మగారికి గుబులు మొదలైంది. నెమ్మదిగా సాయంకాలం అయ్యింది. అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన అల్లుడిని చూసి "ఏవయ్య, చంటిగాడు కనిపించటం లేదు. అల్లరి చేస్తే చిన్నదెబ్బ వేశానని అలిగి ఎటో వెళ్ళాడు. ఇంత వరకు రాలేదు. ఎప్పుడో ఇంత ముద్ద మింగాడు వెర్రినాగన్న. వాడిని వెతికి తీసుకురా. ఎక్కడ వున్నాడో ఏమో" అని సుబ్బమ్మగారు కళ్ళ నీరు పెట్టుకున్నారు.

అత్తగారి మాట కాదనలేక వున్న పళాన చంటిగాడిని వెతకడానికి వెళ్లారు. అయనతో బాటు ఆఫీసులో పనిచేసే టైపిస్ట్ సూర్యనారాయణ గారు కూడా వెతకడం మొదలు పెట్టారు. బ్లాక్ ఆఫీసు, పశువులాస్పత్రి, బందులదొడ్డి వగైరా చోట్ల వెతికారు. చంటిగాడి నేస్తాలు అందరిని అడిగి చూసారు. ఎవరు చూడలేదన్నారు. "ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఎక్కడని వెతకాలి? చంటిగాడు ఏమైనట్టు?" అని తెగ హైరానా పడసాగారు. 

ఇంతలో టైపిస్ట్ గారికి బ్లాక్ ఆఫీసు ముందర ఆగి వున్న ఒక పాత డొక్కు లారీ మీద దృష్టి పడింది. ఎవరో తొంగి చూస్తున్నట్లు అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూస్తే...నాలుగేళ్ల చంటిగాడు కుర్చుని వున్నాడు. బుజ్జగించి కిందకి దింపి ఇంటికి తీసుకొచ్చి అప్పగించారు ఆయన. సుబ్బమ్మగారి కళ్ళలో ఆనందం. చంటిగాడిని దగ్గరకి తీసుకుని ముద్దాడారు. 

Wednesday, June 29, 2011

అమ్మమ్మ కతలు: బుడ్డీ - బూరుగు దూది

అవి సుబ్బమ్మగారు పాడేరులో ఉన్నరోజులు.అల్లుడు అక్కడి గవర్నమెంట్ ఆఫీసులో వుద్యోగం. కూతురు,  మనుమలుతో కొద్ది రోజులు గడపాలని ఆవిడ వచ్చారు. ఎప్పుడు ఖాళీగా కూర్చునే తత్త్వం ఆమెది కాదు.ఏదో ఒక పని కల్పించుకుని చెయ్యాల్సిందే. తెల్లారకట్ల నిద్రలేచింది మొదలు తను స్నానం చేసి ఇంటిల్లిపాదికి కాఫీ, టిఫిన్లు, భోజనాలు అన్ని చకచకా వొంటి చేత్తో చేసేది ఆవిడ.

ఆ రోజు సుబ్బమ్మగారు ప్రతి రోజులానే భోజనం ముగించి వాకిట్లో నడుం వాల్చారు. ఇంతలో కావిట్లో పెద్ద బస్తాలతో ఒక వ్యక్తి అటు వస్తూ కనిపించాడు."ఏవిటి నాయన ఆ బస్తాలు?" అని సుబ్బమ్మగారు అడిగారు."మామ్మగారు, ఇవి బూరుగు దూది బస్తాలు" అన్నాడు వాడు. "ఎలా ఇస్తావేమిటి?" అని బేరం మొదలెట్టారు."బస్తా యాభై కి తక్కువ లేదండి" అన్నాడు."ఇరవై రూపాయలు తీసుకో" అని అన్నారు సుబ్బమ్మగారు."బేరం గిట్టదండి" అన్నాడు వాడు. ఇంతలో అటుగా మరో బూరుగు దూది కావిడి వస్తూ కనబడడంతో సుబ్బమ్మగారు "సర్లేవయ్య, నువ్వు కాకపోతే ఆ అబ్బాయి ఇస్తాడు. వెళ్లిరా!" అనడంతో వాడి మొహం చిన్నబోయింది."సరే బామ్మగారు, తీస్కోండి. ఈ  దూది ఎక్కడ పోయ్యాలో చెప్పండి" అన్నాడు."సరే ఆ బస్తా ఇలా దింపు" అన్నారు.దానికి వాడు "ఈ బస్తా నాకు మళ్ళ అవసరం మామ్మగారు" అన్నాడు."లేదయ్యా, బస్తాతో సహా ఇస్తే ఇవ్వు, లేదంటే వొద్దు." అనడంతో వాడు సరే "పాతిక చేస్కొండి" అన్నాడు. వెంటనే ఇంట్లో ఉన్న కూతురిని కేకేసారు."అమ్మాయ్, ఓ పాతిక రూపాయలు వుంటే ఇద్దు" అని."దేనికమ్మ ఇంత దూది? ఎలా ఒడుకుతావ్. దూదేకుల వాళ్ళు చెయ్యగలరుగాని మనం ఎలా చేస్తాం?" అని కూతురు అడిగితే "నీకెందుకు,ఆ పాంగిగాడిని ఇలా పిలు" అన్నారావిడ. 

పాంగి ప్రసాదు అక్కడే పుట్టిపెరిగిన ఆదివాసి. వాడికి చెయ్యడానికి పని,కడుపు నిండా తిండి పెట్టే సుబ్బమ్మగారంటే చాల ఇష్టం."ఏయ్ బుడ్డి,సెప్పు ఏంటి చెయ్యాలి" అనగానే "ఆవిడ తన చీర ఒకటి ఎండలో వేసి దాని మీద దూది పరిపించారు. ఎగిరి పోకుండా ఇంకో పల్చటి చీర కప్పి రాళ్ళు పెట్టించారు. అది ఎండిన తరవాత పొరుగింటి పాత్రుడమ్మ ఇంటి నుండి ధాన్యం బుట్ట తెచ్చి అందులో ఈ దూది పోయించారు. ఆవిడ చేసే ఈ పనులు ఆ ఆదివాసిలకు ఒక వింత.ఈ ముసలమ్మా ఏమి చేస్తుందా అని వారికి కుతుహులం. ఎదురింటి రాధమ్మ, చిన్నమ్మలు కూడా వచ్చి చూడ సాగారు.పాంగిగాడికి చెప్పి సుబ్బమ్మగారు ఒక వెదురు కర్రని నిలువుగా కోయించారు. దానికి ఇటుఅటు బద్దలు మేకు కొట్టించారు. ఒక కవ్వం మల్లె తయ్యారు చేసి దానితో ఆ దూది చిలకగానే గింజ కిందకి, దూది పైకి తేలింది!! "అమ్మాయి, ఇంట్లో కొత్త బట్ట వుంటే ఇద్దు" అన్నారు. దానితో కూతురి చేత గలేబులు కుట్టించి దూది కూరగానే తలగడాలు సిద్దం. మిగిలిన దూది తో ఇంకా కొత్త బట్ట తెప్పించి రోజాయిలు కుట్టింది ఆవిడ.

చలికాలం రానే వచ్చింది. ఆ ఊరికి ఒక ఆసామి బట్టలు అమ్మేందుకు సైకిల్ మీద వచ్చాడు. "మీ అరుగు మీద ఈ రాత్రికి పడుక్కుని తెల్లారగానే వెళ్లి పోతానండి" అన్నాడు సుబ్బమ్మగారితో. దానికి ఆవిడ "చూడబ్బాయ్, ఇక్కడ చలిలో ఇలాగే పడుకున్నావంటే మరి లేవవు. ఈ దిండు రోజాయి కప్పుకో" అన్నారు అప్యాయంగా.