Saturday, April 27, 2013

ఎక్కడ వుంది లోపం?

'నిర్భయ' సంఘటనతో జనం అందరు ఒక్కసారిగా మేల్కొన్నారు. మంచి మార్పే కాని ఈ మార్పు ఎన్నాళ్ళు? బహుశా లోపం ఎక్కడుందో తెలుసుకుంటే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదేమో!! పరిష్కారం చెప్పేంత శక్తీ నాకు లేకపోవచ్చు కాని నా మనసులో మాట చెప్పాలని ఒక ప్రయత్నం .

ప్రతి తల్లితండ్రి తమ బిడ్డలని పెంచే విధానంలో ఉందేమో ఇదంతా!! శీలం, మానం, పరువు అనే రెండు పదాలకి తప్పు అర్ధాన్ని నేర్పుతున్నాం మనమ్. శీలం శరీరానికి సంబంధించిన విషయమా? కాదు!! అది నా ఉద్దేశ్యం లో మనసుకి సంబంధిచినది. అది ఆడ-మగ ఇరువురికి అవసరం. మొన్న ఈ మధ్య బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం వినడం జరిగింది.కామమైన, అర్ధమైనా ధర్మంతో ముడిపడితేనే అది సరైనది. కాబట్టి  కేవలం మగవాడైనంత చేత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అని ఏ ధర్మమూ, శాస్త్రము చెప్పలేదు. మన సమాజం మాత్రం ఒక మానభంగం జరిగితే కేవలం ఆడదాన్ని తప్పుపడుతోంది. పరువు పేరుతో ఆ కుటుంబాన్ని తలెత్తుకొనివ్వదు. సమాజం, కుటుంబం ఏమంటాయో అనే భయంతో జీవితం ముగించేవారెందరో. ఎందుకీ దుస్థితి?

స్త్రీని శక్తి రూపంగా పూజించే మనం, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు అని చెప్పుకునే మనం... ఒక స్త్రీకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వవలసింది పోయి ఆత్మహత్య శరణ్యం అనుకునే స్థితి ఎందుకు కల్పిస్తున్నాం? అత్యాచారానికి గురైతే జీవితం నాశనం ఐనట్లేనా? ఆ షాక్ నుండి తేరుకునే సహాయం ఎందుకు చెయ్యం? అన్ని విషయాలలో పాశ్చాత్యులను అనుకరించే మనం వాళ్ళ దుస్తుల్ని, వేషధారణ ని విమర్శించే మనం వాళ్ళ దగ్గరున్న మంచిని తీసుకొము. రోడ్ మీద, బస్సు లో, కార్యాలయాల్లో, కళాశాలలో ఇలా ఎక్కడ వెళ్తున్న రోజు లైంగిక వేధింపులకి గురయ్యే ఆడవారు భారత దేశం లో ఎందరో. కాని పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా తక్కువ. అది చూసి సిగ్గు పడాలి. అత్యాచారానికి గురయ్యే ఆడవారిని అక్కడ వివక్షకి గురిచెయ్యరు. కౌన్స్లింగ్ లాంటివి ఇచ్చి ఆ షాక్ నుండి తేరుకునే అవకాశం కల్పిస్తారు.

పాశ్చాత్య వస్త్రధారణ వేసుకునే ఆడవారు మాత్రమే ఇలాంటి వేధింపులకి గురవుతున్నారని చాలా మంది విమర్శించడం చూస్తూవుంటే ఎంతో హాస్యాస్పదం గా వుంటుంది. వావి-వరసలు, వయస్సు మరచి ప్రవర్తించే వారికి ఇవి పట్టవు అనడానికి ఒక ఉదాహరణ ముక్కు పచ్చలారని పసి పిల్లలమీద కూడా మృగాల్లా ప్రవర్తించే నీచులు. ఇటువంటి వారందరినీ వెలివెయ్యకుండా దారుణానికి గురైన ఆడవారిని ఎందుకు వెలివేస్తున్నారు? బహుశా అక్కడే వుంది లోపం. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఆ ఆడవారికి కొండంత ధైర్యం ఇవ్వడం లేదు మనమ్. పిరికి మందు నూరి పోస్తున్నాం. మానభంగం చేసిన వాడితో తాళి కట్టించుకుంటే సమస్య తీరినట్లు చూపే సినిమాలు, పెద్దలు ఉన్నంత వరకు ఈ జడం పోదు.


1 comment:

  1. ఆ పశువులని కన్న తల్లి కూడా ఆడదే .... కానీ ఆ పసువుని కాపాడాలని ప్రయత్నిస్తుంది .... మీరు చెప్పిన మార్పు రావడం కేవలం కలలో మాత్రమే....రావాలని కోరుకోవడం తప్పులేదు ....

    అవినీతి కి సానుభూతికి తేడా గ్రహించే పరిస్థితే లేని సమాజంలో మనం వున్నాం .... మంచి చెడు అనేవి మర్చి పోయి చాలాకాలం అయిపొయింది ...ఇప్పుడు 'మంచి చెడు' అనే రెండు అంశాలు 'నాకు ఉపయోగ పడేది ఉపయోగ పడనిది ' అనేవి గా మారిపోయాయి ..... ఆశాజీవులం..... కానివ్వండి...

    ReplyDelete