Monday, July 23, 2012

మిథునం - నా జ్ఞాపకాలు



 ఇవాళ ఆదివారం కావడం తో టీవీ లో మంచి ప్రోగ్రామ్స్ ఏమున్నాయా అని ఛానెల్స్ మారుస్తుంటే "కుదిరితే ఓ కప్పు కాఫీ" అనే కార్యక్రమంలో తనికెళ్ళ భరణి గారితో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆయన బాపు రమణ ల "మిథునం" అనే నవలని తెరకెక్కిస్తున్నారు. అది తెలిసి చాల ఆనందం అనిపించింది. నాకు బాగా నచ్చిన కథ అది.

భోజనం చేసి కాసేపు పడుకుందామని కళ్ళు మూసుకుంటే "మిథునం" గుర్తుకు రాగానే ఎందుకో కృష్ణ స్వామిగారు, వాళ్ళ ఆవిడ గుర్తుకొచ్చారు నాకు. కృష్ణ స్వామిగారు మా నాన్నగారు మంచి స్నేహితులు. ఇద్దరు ఒక ఈడువారనుకునేరు. మా నాన్నగారు కృష్ణ స్వామి గారికంటే ఓ ఇరవయ్ సంవత్సరాలు చిన్నవారు. 


 మేము అప్పుడు కాకినాడలోవుండేవాళ్ళం. ఆయన,  మా నాన్నగారు ఒకే డిపార్టుమెంటు లో పని చేస్తూ వుండే వారు. ఆ ఏడు వర్షాలు పడి కృష్ణ స్వామి గారి ఇల్లు వరదల్లో కొట్టుకుపోయిందిట.మళ్ళి ఇల్లు కట్టుకోవడానికి పెద్ద మొత్తం లో డబ్బు అవసరం పడి ఎవరిని అడగాలా అని సంకోచిస్తూ కృష్ణ స్వామి గారు మా నాన్నగారిని అడగడం, అపుడు మా అమ్మ తన గాజులు లోన్ పెట్టి ఆ డబ్బు సర్దుబాటు చెయ్యడం తో వారి స్నేహం మొదలయ్యింది. కొద్ది నెలల తరువాత ఒక రోజు కృష్ణ స్వామి గారు మమ్మల్ని వారి ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. 

రిక్షా కట్టించుకుని మంచి ఎండలో ఒక అరగంట ప్రయాణం తరవాత ఊరి చివర  ఇంటి ముందు మేము దిగాం. కర్రల తో దడి కట్టి, ఇంటి చుట్టూ పచ్చగా మొక్కలు, మధ్యలో పర్ణశాలని తలపిస్తూ మట్టి గోడల తో, సున్నం తో రంగవల్లికలు వేసి, పైన తాటాకు పరచిన ఆ ఇంటిని చూస్తే ముచ్చట అనిపించింది. వాకిట్లో ఎదురుగా కృష్ణ స్వామి గారి భార్య లక్ష్మమ్మ నవ్వుతూ మమ్మల్ని లొపల కి ఆహ్వానించారు. చేతులకి నిండుగా గాజులు, నుదుటన పెద్ద  బొట్టు, నేత చీర, మెళ్ళో మంగళసూత్రం , నల్లపూసలు పేరుకు తగ్గట్టు వున్నారావిడ. మంచి నీరు ఇచ్చాక "ముందు భోజనాలు చేసాక కబుర్లు చెప్పుకుందాం" అని ఆవిడ మా అందరికి విస్తట్లో అన్నం వడ్డించారు. పులిహోర, పాయసం, బొబ్బట్లు కడుపునిండా తిన్నాక, మా పెరడు చూద్దురుగాని రండి అని నన్ను అమ్మని తీసుకెళ్ళారు.

 అక్కడ తులసి కోట, చుట్టూ ఉన్న మంచి పూల చెట్లు చూసి లోపలికి రాబోతుంటే "లక్ష్మి! మన సుధకి నీళ్ళు పెట్టావా?" అని కృష్ణస్వామి గారు వాళ్ళ ఆవిడనికేకేశారు. "ఈ సుధ ఎవరబ్బా?  బహుశా ఓ రెండు జడలు, గౌన్ వేసుకుని ఏ పిల్లైన ఇటు వస్తుందేమో" అని నేను చూస్తుంటే  "ఏవిటలా చూస్తున్నావ్ పాపా  , పద సుధకి నీళ్ళు పెట్టి వద్దాం" అని లక్ష్మమ్మ గారు పెరటికి పక్కన చిన్నదారిగుండా నన్నుఅమ్మని  తీసుకెళ్ళారు. ఇద్దరం ఒక పాక ముందు ఆగాం.ఓ గేదె తప్ప నాకు ఏమి కనిపించలేదు. "సుధా అంటే మా గేదె" అని నన్ను మా అమ్మని చూసి నవ్వుతూ చెప్పారావిడ. మళ్ళి ఇంట్లో కి వెళ్ళాక "తెల్లోడు , బండోడు, నల్లోడు ఎక్కడా? వాళ్ళకి కూడా అన్నం పెట్టు. ఎప్పుడు తిన్నారో ఏంటో"  అని కృష్ణ స్వామిగారు అడిగారు. "ఎక్కడికి పోయారో ఏంటో, బహుశా ఆడుకుని మంచాల కింద  నిద్రపోయి వుంటారు " అని ఆవిడ దుప్పటి ఎత్తి మంచాల కింద వెతుకుతున్నారు. చొక్కా నిక్కరు వేస్కొని ఓ ముగ్గురు మగపిల్లలు మంచాల కింద నుండి వస్తారని నేను చూస్తుంటే, ఒక కుక్క రెండు పిల్లులు వచ్చాయి బయటకి. పిల్లులు బద్ధకంగా  వొళ్ళు విరుచుకుని తోకలు పైకెత్తి నెమ్మదిగా "మ్యావ్!" అని అరిచి పెరట్లోకి వెళ్ళాయి. కుక్క మాత్రం మంచి ఠీవీగా నడుచుకుంటూ వెళ్ళింది. నేను వాటి వెనకాలే వెళ్లాను. లక్ష్మమ్మగారు వాటికి ఓ ప్లేట్ లో అన్నం పెట్టారు. అవి ఆవురావురు మని తిన్నాయి. తరవాత పక్కనవున్న గోళెం లోంచి నీరు తాగేసి పెరట్లోకి పారిపోయాయి. నేను కూడా పరుగెత్తి వాటి వెనకాల వెళ్లాను. గేదవున్న పాక ముందునుండి నడిచి వస్తే, ఇంటి ముందర వున్న మొక్కల మధ్యకి వచ్చా. అక్కడ చిన్న చంద్రకాంతం మొక్కలు కనపడ్డాయి. కొన్ని చంద్రకాంతం పూలు, కొన్ని చంద్రకాంతం విత్తనాలు  కోసుకొని దోసిట్లో పట్టుకొచ్చిఅరుగు మీద పెట్టి కూర్చున్నా. ఒక్కో పువ్వుకాడ పీలిస్తే అందులో తుమ్మెదలు దాచుకున్న తేనే తియ్యగా నా నోట్లోకి వచ్చింది. మళ్ళి మొక్కల మధ్యలోకి వెళ్లి కాసేపు మట్టితో ఆడుకుంటే ఎర్రగా ఏదో కనిపించింది. తవ్వి చుస్తే అక్కడ బోలెడు గురువింద గింజలు కనిపించాయి. అవన్నీ ఏరి చిన్న రుమాలు లో కట్టాను. "ఎక్కువ సేపు ఎండలో ఆడకు కన్నా. త్వరగా లోపలకి వచ్చేసెయ్ " అని చెప్పి అమ్మ లోపలకి వెళ్ళిపోయింది.

అరుగు మీద కూర్చున్న నాకు ఇంట్లోంచి కబుర్లు వినిపిస్తున్నాయి. కృష్ణస్వామి గారు, వాళ్ళ ఆవిడ వరదలు తగ్గాక, స్వయంగా మట్టి తొక్కి  ఆ ఇల్లు మళ్ళి కట్టారుట. వాళ్ళు జంతు ప్రేమికులని మాటల్లో తెలిసింది. అంతే కాదు, ఇద్దరిది ప్రేమ వివాహమని, ఇద్దరు పిల్లలు వున్నా, మరో ఇద్దరు అనాధల ని చేరదీసి పెంచి చదివించి, పెళ్ళిళ్ళు  చేసారుట. ఎంత మంచి మనస్సో. ఆ వయసులో నాకు అంతగా అర్ధం కాకపోయినా, ఇప్పుడు తలచుకుంటే చాల ముచ్చటేస్తుంది. ఆ ఇల్లు, పచ్చని చెట్లు, తెలుగింటి భోజనం  తలచుకుంటే మిథునం కథలో ఇంటి పెరడు గుర్తుకు వస్తుంది నాకు.


16 comments:

  1. చక్కగా రాశారు, అభినందనలు.మిథునం కి, మీ జ్ఞాపకాలకి సంబంధం చెపితే ఇంకా బావుండేదేమో, అది చదవని నాలాంటివారికి.

    ReplyDelete
    Replies
    1. ట్రీ భాస్కర్ గారు, మిథునం గురించి రాసేందుకు సమయం, స్థలం రెండూ సరిపోవండి. అందుకే క్లుప్తంగా ఆఖరి వాక్యంలో ప్రస్తావించాను. మీ సూచనకి ధన్యవాదాలు.

      Delete
  2. నిజమో, కల్పనో ,కథో గాని బాగుందండి.
    ట్రీ భాస్కర్ గారు, మిథునం ఒక వయసు మళ్ళిన భార్యాభర్తలు , వాళ్ళ ఏళ్ళనాటి అనుబంధం, వాళ్ళ పెరట్లోని మొక్కలు కథావస్తువుగా చాలా మనోరంజకమైన ఒక కథ.

    ReplyDelete
    Replies
    1. లక్ష్మీదేవి గారు, ధన్యవాదాలు. ఇందులో చాలా వరకు నిజం, కొంత మాత్రమే నా కల్పన

      Delete
  3. Mithunam was written by 'SREE RAMANA' not Bapu Ramana.
    It was made in to a succesful film in Malayalam by MT vasudevan Nair a decade ago,,name "ORU CHIRUPUNJARI"

    ReplyDelete
    Replies
    1. If iam right, he illustrations in the novel were by bapu and yes the writer is Sri ramana

      Delete
    2. శ్రీరమణ గారు వ్రాసిన "మిధునం" కధకు అభిమానం తో బాపు గారు బొమ్మ వేసి ఇచ్చారు.
      ఆ అభిమానం ఇంకాస్త ఎక్కువై మొత్తం కధను తన స్వదస్తూరితో వ్రాసికూడా ఇచ్చారు.
      కధ యొక్క పూర్తి సాహితీ పరిమళం వెండితెర మీద గుబాళించకపోవచ్చు పోవచ్చు, కానీ మంచి దృశ్య కావ్యం ఆశిద్దాం.

      Delete
    3. అత్రేయగారు, అవునండి. సాహితి అభిమానులంతా ఎదురుచూస్తున్న సినిమా ఇది.

      Delete
  4. మంచి జ్ఞాపకం :)

    ReplyDelete
    Replies
    1. శేఖర్ గారు, ధన్యవాదాలు

      Delete
  5. ఎక్కడికో తీసుకు వెళ్లారండీ! ఎంత బావుంది.. !! కనులారా దృశ్యం మనోహరంగా..

    ReplyDelete
    Replies
    1. వనజవనమాలిగారు, ధన్యవాదాలు

      Delete
  6. తన కల్పనా చాతురితో మిధునం కథని అద్భుతంగానూ, అంత రమణీయంగానూ, తీర్చి దిద్దిన శ్రీ రమణ గారైనా,ఎక్కడో ఒకచోట మీరు చెప్పిన కృష్ణ స్వామి దంపతుల వంటి వారిని చూచి ఉండక పోతే ఆ కథ వ్రాయగలిగే వారు కారని నా కనిపిస్తుంది. ఆనందమే మన ధ్యేయమైతే అది మన గుమ్మం దాటకుండానే లబిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. గోపాలకృష్ణగారు, ధన్యవాదాలు

      Delete
    2. Hi Bindu,

      The story is full of real life facts. Krishnaswamy (as you preffered to name) was an ex.service man. He lived a simple life after retiring from army at 35 yrs. and served in APSRTC along with me. He was called back on duty in 1975 Bangla war and he fought near Dakha. He donated his life long pensionl to National Defence Fund. He worked in 7th Regiment. I took you to his simple house and I now recall all those things which excited you. Good writing. Keep it up.

      Delete