అలారం మోగడంతో మెలుకువ వచ్చింది పరిమళకి. ఇంకాసేపు ముసుగు తన్ని పడుకుందామని అనుకుంది. ఇంతలో ఆఫీసు గుర్తుకు వచ్చేసరికి నిద్ర కాస్త ఎగిరిపోయింది. "హు ఇవాళ ఇంకా గురువారం. మరో రెండ్రోజులు ఎలాగో ఆఫీసుకి వెళ్తే, ఆదివారం వచ్చేస్తుంది. హాయిగా గుర్రుపెట్టి పడుకోవచ్చు" అని మనసుకి సర్దిచెప్పుకుంది. చకచకా వంట, స్నానం, టిఫిన్ ముగించి పిల్లలికి, భర్తకి, తనకి డబ్బాలు సర్ది చెప్పులేసుకుంటూ "ఏవండి, ఆఫీసుకి వెళ్తున్నా. పిల్లల స్కూల్ ఆటో ఇంకో పది నిమిషాలలో వచ్చేస్తుంది. వాళ్ళని ఎక్కించి మీరు ఆఫీసుకి వెళ్ళండి" అని భర్త మధుకి చెప్పి బస్ స్టాప్ కి పరుగెత్తింది. అసలే ఎండాకాలం. ఉక్కపోతగా వుంది. దానికి సాయం బస్ జాడ ఇంకా లేకపోడంతో వుసూరుమనిపించింది పరిమళకి. ఇంతలో ఆఫీసులో స్వాతి గుర్తుకురాగానే చిరాకు పుట్టుకువచ్చింది.
పరిమళ, స్వాతి ఇద్దరు ఒకే ఆఫీసులో గత పదేళ్ళగా పని చేస్తున్నారు. మొదట్లో స్వాతి బాగానే మాట్లాడేది. కాని రాను రాను ఆమెతో మాట్లాడగా పరిమళకి ఒక విషయం అర్ధమయింది. ఆమె ప్రతిదానికి ఇతరులతో పోల్చుకుని తను గొప్ప అని ఫీల్ అవుతూ వుంటుంది. తను చెప్పింది కరెక్ట్ అనే రకం. కాదని ఎవరైనా ఏదైనా చెప్పబోతే వాళ్ళని హేళన గా మాట్లాడుతూ వుంటుంది. పరిమళ స్వతహాగా నెమ్మదస్తురాలు కావడంతో స్వాతిని ఎదురుకోవడం ఆమెకి ఒక రకంగా కష్టమైన విషయం. అందుకనే స్వాతికి సాధ్యమైనంత దూరంగా మసలుతుంది. కాని పక్క సీట్ కావడంతో ఒక్కోసారి దొరికి పోతూ వుంటుంది. ఆలోచనల్లో ఉండగానే బస్ వచ్చేసింది. సీట్ దొరకడంతో పరిమళ అందులో కూలబడింది. కర్చీఫ్ తో మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ వుండగా పరిమళ కి మొన్న జరిగిన సంఘటన ఒకటి గుర్తుకు వచ్చింది.
ఆ రోజు తమ ఆఫీసులో క్లెర్క్ రాణి కొత్త నెక్లస్ పెట్టుకు వచ్చింది. లంచ్ అవర్లో మిగతా ఆడవాళ్ళందరూ చాలా బాగుంది అని మెచ్చుకున్నా, స్వాతి మాత్రం నెక్లస్ మా అమ్మమ్మ కాలం మోడల్లాగా వుంది అంటూ వెటకారం చేసింది. సాయంత్రం ఆఫీసు ముగిసేముందు మేనేజర్ వచ్చి "స్టార్ అఫ్ ది వీక్" అవార్డు ప్రకటించారు . స్టాఫ్ లో ఉత్సాహం నింపడానికి ఈ మధ్యే కొత్తగా ఈ అవార్డు మొదలుపెట్టారు. ఈ అవార్డు అందుకున్న వాళ్ళకి స్టార్ హోటల్లో ఒక జంటకి డిన్నర్ ఫ్రీ. ఆ వారం అవార్డు పరిమళకి వచ్చింది. మేనేజర్ పరిమళని విజేత గా అనౌన్స్ చెయ్యగానే అంతా కంగ్రాట్స్ చెబుతూ వుంటే స్వాతి మాత్రం దూరంగా ఏదో పని ఉన్నట్టు వేరే సెక్షన్లో గడిపింది. మరునాడు ఆఫీసు కి వచ్చాక కూడా ఏమి మాట్లాడలేదు.
అలాంటిది నిన్న సాయంత్రం ఆఫీసు నుండి బయలుదేరేటప్పటికి ఎందుకో స్వాతి చాలా ఉత్సాహంగా కనిపించింది. పని ముగించి బయలుదేరబోతున్న పరిమళని చూసి "ఏయ్ పరిమళ, నీకో విషయం చెప్దామంటే ఏంటి అప్పుడే వెళ్లి పోతున్నావ్. నిన్న అవార్డు వచ్చిన ఆనందంలో ఇవాళ పని డుమ్మా కొట్టావా" అని అడిగేసరికి పరిమళకి చిర్రెత్తుకొచ్చింది. అయినా తమాయించుకొని "లేదు అయిపోయింది. కొంచం తలనెప్పి గా వుందని" ఎలాగో తప్పించుకు వచ్చింది. "దేవుడా ఇవాళ దొరికి పోడం ఖాయం" అని అనుకుంటూ వుండగా తన దిగవలసిన స్టాప్ వచ్చేసింది. "ఆఫీసుకి వెళ్లి స్వాతి చూడకుండా నెమ్మదిగా తన సీట్లో కూర్చోవాలి. ఇంకో అరగంటలో ఎలాను మీటింగ్ వుంది కాబట్టి మధ్యాహ్నం దాక దీని సుత్తి తప్పించుకోవచ్చు" అనుకుంది. జాగ్రత్తగా బాగ్ సీట్ పక్కన పెట్టి ఊపిరి పీల్చుకుంది. సీట్లో కుర్చోబోతుండగా "పరిమళా!!" అని స్వాతి గొంతు విని రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తూ ట్రాఫ్ఫిక్ పోలీసుకి పట్టుబడ్డదానిలాగా ఉలిక్కిపడింది పరిమళ.
"ఏయ్ పరిమళా, నీకో విషయం చెప్పాలని నిన్నటి నుండి ప్రయత్నిస్తున్నా. నాకు మావారికి ఉత్తమ జంట అవార్డు వచ్చింది తెలుసా. మాకు డిన్నర్ ఏం ఖర్మ ఏకంగా ఐదు రోజులు ఊటీలో వసతి, భోజనం ఫ్రీ" అని ఊదరగొట్టేసింది. "అవునా!! ఇంతకి ఎప్పుడు పాల్గొన్నారు పోటి ఎక్కడ జరిగింది?" అని అడిగింది పరిమళ ఉండబట్టలేక. "పోటి గీటి జాంత నై. మావారికి నిన్న మధ్యాహ్నం ఆఫీసులో ఉండగా ఫోన్ వచ్చిందిట . ఇవాళ సాయంత్రం హోటల్ హాలిడే వ్యూలో అవార్డు ప్రదానం, డిన్నర్. వచ్చాక అన్ని వివరాలు చెప్తాన్లే" అని గర్వంగా చెప్పింది. "అదేంటి స్వాతి, ఏ పోటి లేకుండా ఉత్తినే అవార్డు ఎందుకిస్తారు?" అని అడిగిన పరిమళని పిచ్చిదాన్ని చూసినట్లు చూసింది. "లక్కీ డ్రా లో విజేతలుగా మమ్మల్ని ప్రకటించారు" అని ఇంకా ఏదో చెప్పబోయేంతలో మీటింగ్ టైం అవడంతో పరిమళ ఇంక ఆ విషయం అక్కడితో ముగించడం మంచిదని "అవునా!!కంగ్రాట్స్!!" అని చెప్పి మీటింగ్ రూం వైపు నడిచింది. పని ముగించుకుని వెళ్తున్న పరిమళకి సీట్లో స్వాతి కనిపించకపోవడంతో బహుశా హోటల్ కి వెళ్ళడం కోసం ఇంటికి త్వరగా వెళ్ళిపోయివుంటుంది అని అనుకుంటూ బస్ స్టాప్ కి నడిచింది.
స్వాతి మరునాడు ఆఫీసుకి వచ్చిందన్న మాటేగాని ఎంతకీ జాడలేదు. లంచ్ టైములో కూడా సీట్లోంచి కదలలేదు. స్వాతి తత్త్వం తెలిసిన పరిమళకి ఇది వింతగా అనిపించింది. "కొంచం అవకాశం వచ్చినా వదలని స్వాతి ఇవాళ ఉలుకు పలుకు లేదేంటబ్బా? ఒక వేళ వంట్లో బాగాలేదా?" అనుకుంది. "ఉహు, అలా కనిపించట్లేదు. మరి ఏమై ఉంటుంది?" అని ఆశ్చర్యపోయింది. "మెల్లగా కదిపి చూస్తే సరి. అమ్మో! ఒకవేళ తనని ఏమైనా అంటే? కాని ఎలాగైనా తెలుసుకోవాలి" అని నిశ్చయించుకొని స్వాతిని సమీపించింది.
"స్వాతి నిన్న ఫంక్షన్ బాగా జరిగిందా? ఏమిటి విశేషాలు?" అని అడగ్గానే అడిగిందే తడవుగా పెద్ద ఉపన్యాసం దంచే స్వాతి ముందు ఏమి మాట్లాడలేదు. కొంచం కదపగా తిట్లవర్షం మొదలుపెట్టింది. వివరంగా చెప్పమని పరిమళ అడగ్గా "అంతా వుట్టి నాటకం. ఉత్తమ జంటా నా ముఖమా. వెళ్ళగానే ఒక లేడి ఎదురొచ్చి మమ్మల్ని ఆహ్వనించగానే ఎంతో మురిసిపోయాం. చాల సేపు మమ్మల్నిఒక చోట వెయిట్ చేయించారు. ఏది వేదిక ఎక్కడ? అతిథులు ఏరి? అని నిలదీస్తే అవార్డు ప్రదానం ఏమి కాదు. మీరు ఊటీకి ట్రిప్ గెల్చుకున్నారు. అది మీకు డిన్నర్ తరవాత అందచేస్తాం. ముందు మీరు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యాలి అన్నారు. తీరా చూస్తే మీరు ఈ రిసార్ట్ కి మెంబెర్ షిప్ కి ఇంత డబ్బుకట్టండి. అప్పుడు మీకు అందులో ఐదు రోజులు వసతి, భోజనం ఫ్రీ అన్నారు. కట్టమంటే కనీసం రిజిస్ట్రేషన్ కి డబ్బు కట్టమన్నారు. నేను మావారు గట్టిగా తగువు పడేసరికి భోజనం కూడా పెట్టకుండా పంపించేసారు. ఇంటికి వచ్చి వండే ఓపికలేక ఆ హోటల్లోనే బిల్ కట్టి తినేసి వచ్చాం" అని ముగించేసరికి పరిమళకి నవ్వాగలేదు.