వేసవి సెలవలు ఇవ్వడంతో సుబ్బమ్మగారి మనవలు రాముడు, చంటి ఇద్దరు ఇంట్లోనే వున్నారు. వంటపొయ్య దగ్గర వున్న సుబ్బమ్మగారు, ఇద్దరినీ కేకేసి "అమ్మకి తలనొప్పిగా వుంది. పడుకుంది. ఇద్దరు చెంబుడేసి నీళ్ళు పోసుకుని, పిడికిడేసి అన్నంతినేసి ఆడుకోండి. గొడవ చెయ్యద్దు" అని చెప్పి పంపించేసారు.
వాళ్ళిద్దరూ బుద్ధిగా స్నానంచేసి ఇంత అన్నం తిని, క్యారం బోర్డు ఆడుకోడం మొదలు పెట్టారు. కొంతసేపు ఆట బాగానే సాగింది. ఇంతలో రాముడు రెడ్ కాయిన్ వెయ్యడం తో చంటికి కోపం వచ్చి మీదపడి కొట్టడం మొదలు పెట్టాడు. రాముడు ఊరుకోలేదు. తను ఒక దెబ్బవేసాడు. అది చిలికిచిలికి గాలివాన అయ్యింది. ఇంతలో సుబ్బమ్మగారు చూసి ఇద్దరినీ కోప్పడి, చంటిగాడిని చిన్నదెబ్బ వేసారు. అంతే... వాడు ఏడుస్తూ ఇంట్లోంచి పారిపోయాడు. గంట, రెండు గంటలు, మూడు గంటలు గడిచాయి కాని చంటిగాడి జాడ లేదు. సుబ్బమ్మగారికి గుబులు మొదలైంది. నెమ్మదిగా సాయంకాలం అయ్యింది. అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన అల్లుడిని చూసి "ఏవయ్య, చంటిగాడు కనిపించటం లేదు. అల్లరి చేస్తే చిన్నదెబ్బ వేశానని అలిగి ఎటో వెళ్ళాడు. ఇంత వరకు రాలేదు. ఎప్పుడో ఇంత ముద్ద మింగాడు వెర్రినాగన్న. వాడిని వెతికి తీసుకురా. ఎక్కడ వున్నాడో ఏమో" అని సుబ్బమ్మగారు కళ్ళ నీరు పెట్టుకున్నారు.
అత్తగారి మాట కాదనలేక వున్న పళాన చంటిగాడిని వెతకడానికి వెళ్లారు. అయనతో బాటు ఆఫీసులో పనిచేసే టైపిస్ట్ సూర్యనారాయణ గారు కూడా వెతకడం మొదలు పెట్టారు. బ్లాక్ ఆఫీసు, పశువులాస్పత్రి, బందులదొడ్డి వగైరా చోట్ల వెతికారు. చంటిగాడి నేస్తాలు అందరిని అడిగి చూసారు. ఎవరు చూడలేదన్నారు. "ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఎక్కడని వెతకాలి? చంటిగాడు ఏమైనట్టు?" అని తెగ హైరానా పడసాగారు.
ఇంతలో టైపిస్ట్ గారికి బ్లాక్ ఆఫీసు ముందర ఆగి వున్న ఒక పాత డొక్కు లారీ మీద దృష్టి పడింది. ఎవరో తొంగి చూస్తున్నట్లు అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూస్తే...నాలుగేళ్ల చంటిగాడు కుర్చుని వున్నాడు. బుజ్జగించి కిందకి దింపి ఇంటికి తీసుకొచ్చి అప్పగించారు ఆయన. సుబ్బమ్మగారి కళ్ళలో ఆనందం. చంటిగాడిని దగ్గరకి తీసుకుని ముద్దాడారు.